పవన్ కళ్యాణ్ ‘హిట్ లిస్ట్’లో మరో సీమ సీనియర్ నేత !

రాజకీయాల్లో ఆవేశం ఒక్కటే సరిపోదు, ఆలోచన కూడా అవసరం..! ఈ సూక్తిని ఒంటబట్టించుకున్నారు గనుకే.. పవన్ కళ్యాణ్ ‘పొలిటికల్ మెంటర్స్’ కోసం వేట మొదలుపెట్టేశారు. ‘ఒకరి దగ్గర నేర్చుకునేదేంటి’ అనే ఏకోవాదాన్ని వదిలిపెట్టినట్లు ఆయనే ఇటీవల చెప్పుకున్నారు. తలలు పండిన కొందరు రాజకీయ మేధావుల్ని వెతుక్కునిమరీ ఓనమాలు దిద్దుకునే దిశగా పడ్తున్నాయి జనసేనాధినేత అడుగులు. ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో.. ‘పెద్దల’నందరినీ ఒక గొడుగుకిందకు తెచ్చిన ఆయన ప్రయత్నం కూడా మంచి ప్రశంసల్ని దక్కించుకుంది. తాను కూడా ఉండవల్లి, జేపీ లాంటి వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని పవన్ కల్యాణే నేరుగా చెప్పారు. తాజాగా.. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీనియర్ నేత దాడి వీరభద్రరావును కలిసి.. మీరు నాకు రాజకీయ గురువులు అంటూ ఆకాశానికెత్తేశారు. ఆయన్ను జనసేనలో చేర్చుకునే అవకాశాలున్నాయన్న సంకేతాల్ని కూడా ఇచ్చారు. ఇదే క్రమంలో.. ఇటు.. రాయలసీమ నుంచి మరో సీనియర్ రాజకీయ నాయకుడు.. జనసేనకు కన్ను గీటేశారు.

మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఎంవీ మైసూరా రెడ్డి.. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి పాల్వంచకొచ్చారు. ఆ సందర్భంలో ఆయాచితంగా ఆయనన్న కొన్ని మాటలు వర్తమాన రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని, అనూహ్య మార్పులు రావడం తథ్యమని మైసూరా అన్నారు. ఎలా అని అడిగితే.. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజాకీయాల్లోకొచ్చారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తోంది.. అది చాలదా సంచలనానికి దారిపడ్డానికి.. అంటూ ఎదురు ప్రశ్నించారు. పైగా ప్రత్యేక సీమ సాధనకు, సీమ కరవు నివారణకు కష్టపడతానని పవన్ కల్యాణే చెప్పారుగా అంటూ సాగదీశారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలం మైసూరాను ఆకర్షించాయని, పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా వున్నారని ఆయన అనుచరవర్గం మీడియా చెవుల్లో చెబుతోంది. ఒకప్పుడు అన్ని పార్టీల్లోనూ ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం వైసీపీ నుంచి విడిపడి.. ఏ పార్టీతోనూ సంబంధాల్లేకుండా ‘ఖాళీ’గా వున్న మైసూరా లాంటి సీనియర్లను జనసేన కూడా వదులుకునే పరిస్థితిలో లేదు. ఈ లెక్కన.. పవన్ ‘హిట్‌లిస్ట్’లో మైసూరా వున్నట్లే మరి!

Related News