అమ్మ ప్రశంస.. బసవతారకం ఆస్పత్రి వైద్యం

బసవతారకం ఆస్పత్రిలో ఎవరు వైద్యం పొంది ప్రశంసించినా అమ్మే దీవించిందని భావిస్తానన్నారు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. బసవతారకం హాస్పిటల్ ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ అని.. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత ముఖ్య అతిధిగా హాజరవ్వగా, ఆసుపత్రి ఛైర్మన్, సీనీ నటుడు బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, హీరోయిన్ శ్రియలు హాజరయ్యారు. ఎంపీ కవిత మాట్లాడుతూ క్యాన్సర్ విషయంలో ఎంత చేసినా, ఇంకా చేయాల్సింది ఉందని అన్నారు. మహిళలు ప్రతి యేడాది సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే… చికిత్స సులభతరం అవుతుందన్నారు. ఆసుపత్రికి ట్యాక్స్ రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి బసవతారకం ఆస్పత్రికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.

Related News