మా మహేష్‌బాబుకు నటన రాదంటారా? ఖబడ్ధార్..!

తమిళనాట స్టాండప్‌ కమెడియన్‌గా పేరున్న మనోజ్‌ ప్రభాకర్‌ అనే కుర్రాడు చేసిన కామెంట్స్ టాలీవుడ్, కోలీవుడ్‌ల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. మనం సూపర్‌స్టార్‌గా పిల్చుకుంటున్న ప్రిన్స్ మహేష్‌బాబుకు అసలు నటించడమే రాదని, అతడిదో చెక్క మొహమని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడతడు. స్పైడర్‌ మూవీని ఉదాహరణగా చూపుతూ.. విలన్ పాత్రలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే మహేష్ మాత్రం నిర్వికారంగా అలా చూస్తుండిపోయాడని రెచ్చిపోయి మాట్లాడాడు. అక్కడితో ఆగకుండా కత్రినాకు మేల్‌ వర్షన్ మహేష్‌బాబు అంటూ అతడిచ్చిన ఫినిషింగ్ టచ్.. పెద్ద దుమారాన్నే రేపింది.

‘అకాడమ్మీ’ అవార్డ్స్ అనే ఒక స్టేజ్ ప్రోగ్రాంలో మనోజ్ ప్రభాకర్ విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడమే గాక.. మహేష్ ఫ్యాన్స్ మీద కూడా ‘దాడి’ షురూ చేశాడు. టామ్ క్రూజ్ ఫేస్‌బుక్ ఖాతాలోకి వెళ్లి ‘మా మహేష్‌ని చూసి యాక్షన్ నేర్చుకో’మంటూ కామెంట్ పోస్ట్ చేస్తున్నారని ఎద్దేవా చేశాడు. తెలుగులో మహేష్ సినిమా టైటిల్స్‌ని ప్రస్తావిస్తూ.. స్పైడర్‌తో తమిళంలో ఎంట్రీ ఇద్దామనుకున్న ఆ హీరోకు వర్కవుట్ కాలేదని అతడు చేసిన ఎగతాళి వివాదాస్పదమయ్యింది.

వెంటనే తేరుకున్న మన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. పెద్ద సైజు లేఖను తయారు చేసి.. చెన్నై నడిగర్ సంఘానికి పంపింది. ”మా మహేష్‌ని అన్నేసి మాటలన్న మనోజ్ ప్రభాకర్ విషయం ఏం చేశారు” అంటూ నిలదీసింది ‘మా’. నడిగర్ సంఘం తీసుకోబోయే చర్యల తర్వాత.. తమ తదుపరి యాక్షన్ ప్లాన్ ఉంటుందని హెచ్చరించింది కూడా!

 

తెలుగు ఇండస్ట్రీ నుంచి తాకిడి మొదలవ్వగానే.. కుర్రాడు దారికొచ్చేశాడు. ”మీ హీరో మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి దురభిప్రాయం లేదు. స్పైడర్ తమిళ్ వెర్షన్ మీద మాత్రమే కామెంట్ చేశా”నంటూ ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చాడు. అయితే.. తప్పయిపోయింది క్షమించండి అంటూనే మహేష్ ఫ్యాన్స్‌కి చురకలంటించాడు మనోజ్ ప్రభాకర్. ”నేను చెండాలంగా ఉన్నానంటూ చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. నేను అందంగా లేనన్న సంగతి నాకు తెలుసు. కానీ.. సృష్టిలో ఎవరూ అందంగా వుండరన్న నగ్నసత్యం మీకు తెలియడానికి కొంచెం టైం పడ్తుంది.. వెయిట్ చేయండి..” అంటూ సెటైర్ వేశాడు. దీంతో అతడు క్షమాపణ చెప్పినట్లా కాదా అనే సంశయం మొదలైంది ప్రిన్స్ ఫ్యాన్స్‌కి!

Related News