అదే రోజు ‘జమిలి’ ప్రకటన!

ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక సంస్కరణ వైపు ముందడుగు వేయనున్నారు. దేశ గతిని పూర్తిగా మార్చే ఒక నిర్ణయానికి తెగించనున్నట్లు ఖచ్చితమైన సమాచారం లభిస్తోంది. ఆగస్టు 15న ప్రధాని నోటి నుంచి ఒక సంచలన ప్రకటన రావొచ్చని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఢిల్లీ ఎర్రకోట వేదికగా జరిగే పంద్రాగస్టు ప్రసంగం ద్వారా.. ప్రధాని మోదీ ‘జమిలి ఎన్నికల’ నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నదే సదరు బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే అనేక విడతలుగా కసరత్తు ముగిసిన ‘జమిలి’ ప్రక్రియకు పంద్రాగస్టు నాడే అంకురార్పణ చేయనున్నట్లు బీజేపీ అధిష్టానం ఫీలర్లిచ్చేసింది. ఆగస్ట్‌ 15 తరువాత దేశమంతా ‘ఎలక్షన్‌ మోడ్‌’లోకి వెళ్ళబోతోందని, పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని అమిత్‌షా పార్టీ క్యాడర్‌కి డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్తకు బలం చేకూరుతోంది.

పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన.. ప్రభుత్వ యంత్రాంగాల్ని కూడా అప్రమత్తం చేసింది. ఇవ్వాళ రేపు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో లాకమిషన్ చర్చలు జరుపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. కానీ.. అన్ని శాసనసభల పరిస్థితులూ జమిలికి అనుకూలించవు కనుక.. రెండు విడతలుగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ‘రాష్ట్రాల విభజన’ కూడా జరిగిపోయిందన్నది మరో ఊసు. ఏదేమైనా.. మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగిసే డిసెంబర్ నాటికల్లా జమిలి నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుంది. దీంతో పంద్రాగస్టు మీద దేశమంతా ఆసక్తి నెలకొంది.

Related News