రాజకీయం వేరు.. అభివృద్ధి వేరు- మంత్రి గడ్కరీ

పోలవరం ప్రాజెక్ట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దని స్పష్టంచేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అభివృద్ధి పనుల విషయంలో తాము రాజకీయం చేయబోమన్నారు. పోలవరానికి నిధుల సమస్య లేదని, ముందస్తుగా నిధులు ఇవ్వాలని సీఎం అడిగారని, ఈ విషయంపై ఆర్థికశాఖతో చర్చిస్తామన్నారు. సవరించిన అంచనాలపై ఆర్థికశాఖ నుంచి ఆమోదం తీసుకోవాల్సివుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

ఏప్రిల్‌ నాటికి సివిల్ వర్క్స్‌ పూర్తిచేస్తామని అధికారులు అన్నారని, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని సూచించానన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. పనుల్లో పురోగతి, ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై ఆరా తీశారు గడ్కరీ.

పోలవరం ప్రాజెక్ట్‌ని మరోసారి సందర్శిస్తానని, సివిల్‌ వర్క్‌ అంచనాల్లో చాలా తేడాలున్నాయని చెప్పిన కేంద్రమంత్రి, వాస్తవ వివరాలతో రాష్ట్రప్రభుత్వం కొత్త డీపీఆర్‌ ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాల్సి ఉన్నందున ప్రాజెక్ట్‌ అంచనాలు పెరిగాయని, సవరించిన అంచనాలతో ఇప్పటికే డీపీఆర్‌ ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.

సాంకేతిక సమస్యల పరిష్కారం బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవుతుందన్నారు. ఇందులో భూసేకరణకే రూ. 33వేల కోట్లు అవుతుందని చెప్పారు. 2019 డిసెంబర్‌ను డెడ్‌లైన్‌గా పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.

 

READ ALSO

Related News