నాన్న లేకుండానే లోకేష్ కీలక నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించే రాజకీయ పార్టీలు.. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా ఏడాది ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు తెరతీస్తున్నాయి. జగన్ తన పాదయాత్రలోభాగంగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో తామేమీ తీసిపోమనట్టు టీడీపీ కూడా ఓ అడుగు ముందుకేసింది. సాధారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల పేర్లను స్వయంగా ప్రకటించేవారు. కానీ, ఈసారి చినబాబే రంగంలోకి దిగేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్‌లో వుండగా, మంత్రి లోకేష్.. తన కర్నూల్ టూర్ సందర్భంగా.. ఈ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటన టీడీపీలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అభ్యర్థులను అధినేత ముందే ఎంపిక చేశారా? లేక ఈ విషయంలో చినబాబే తొందరపడ్డారా? అనేదానిపై టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. సోమవారం ఏపీ పాలిటిక్స్‌లో ఇదే హాట్ టాపిక్! కొద్దిరోజుల కిందట ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుతో పాటు.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల గురించి ఐవీఆర్ కాల్స్ ద్వారా నియోజకవర్గాల ఓటర్ల నుంచి సమాచారం సేకరించారు టీడీపీ అధినేత. ఈ ప్రాధమిక సమాచారం ఆధారంగానే కర్నూలు విషయంలో లోకేష్ చొరవ చూపినట్టు తెలుస్తోంది.

Related News