ఒలింపియన్‌కి షాకిచ్చిన సింధు

మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. అద్భుతమైన ఫామ్‌లోవున్న తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు తమ అద్భుతమైన పోరాటంతో ప్రత్యర్థులను మట్టి కరిపించి సెమీస్‌కి దూసుకెళ్లారు.

మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 22-20, 21-19 తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్(స్పెయిన్)పై నెగ్గింది. గేమ్ మొదలైన నుంచి ఇద్దరు ఆటగాళ్లు మధ్య నువ్వానేనా అన్నరీతిలో పోరు సాగింది. మొదటి సెట్‌ని అతి కష్టంమీద గెలుచుకున్న సింధు, తర్వాత సెట్‌లోనూ అదే పోరాటాన్ని ప్రదర్శించింది. సింధు ముందు కరోలినా వేసిన ఎత్తులన్నీ చిత్తయ్యాయి. ఒలింపిక్స్‌లో కరోలినా చేతిలో సింధు ఓడిపోయిన తర్వాత వీళ్లిద్దరు పలుమార్లు పోటీపడిన విషయం తెల్సిందే! ఇక సెమీస్‌లో చైనీస్ తైపీకి చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణి తై యంగ్‌తో తలపడనుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ శ్రీకాంత్ 21-18, 21-14తో బ్రైస్ లెవర్‌డెజ్(ఫ్రాన్స్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. 39 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ అలవోకగా విజయం సాధించాడు. ఈ ఏడాది జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు గేమ్స్‌ల్లోనూ ఫ్రెంచ్ క్రీడాకారుడిని శ్రీకాంత్ ఓడించాడు.

Related News