హీరో శివాజీ అన్నట్టే,బాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో సంచలనం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఓ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు సహా 14మందికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఈనెల 21లోగా చంద్రబాబుతోపాటు మిగతా వాళ్లను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.

 

ఇంతకీ కేసు ఏంటి?

 

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం చేసిన పోరాటానికి ఈ వారెంట్‌ జారీ చేసింది మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో అప్పటి ప్రతిపక్షనేతగా వున్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు, నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, వాళ్ల విధులకు ఆటంకం కలిగించడం, ఇతరుల భద్రతకు ముప్పు కలిగించడం వంటి అభియోగాలు మోపారు. అప్పటినుంచి ఈ కేసు ధర్మాబాద్‌ న్యాయస్థానంలో ఉంది. ఐతే, దీనికి సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వ్యక్తి.. ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది.

ఏపీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, చింతమనేని ప్రభాకర్, తెలంగాణ టీడీపీ నేత నామా, టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్, హనుమంత్ షిండే వంటి నేతలు వారెంట్ జాబితాలో వున్నారు.  ఈ వారెంట్‌పై మంత్రి లోకేష్ స్పందించారు. మోదీ సర్కార్‌కు మరే విషయం దొరక్క బాబ్లీ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సహా మిగతావాళ్లు న్యాయస్థానంలో హాజరవుతారని అన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదొక కక్ష సాధింపుగా టీడీపీ అభివర్ణించింది.

 

ఇంతకీ నటుడు శివాజీ ఏమన్నారు?

 

వారంరోజుల కిందట మీడియా ముందుకొచ్చిన నటుడు శివాజీ, ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని, ఏపీ సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలిగే ఓ అంశం ఒకటి తెరపైకి రానుందని ఆయన వెళ్లడించారు. సీఎం చంద్రబాబుకు త్వరలో నోటీసులు వస్తాయని, ప్రస్తుతానికి ఇంతకుమించి తానేమీ చెప్పలేనని అన్నారు. శివాజీ అన్నట్టుగానే జరిగిందని రాజకీయ నేతలు చర్చించుకోవడం కొసమెరుపు.

Related News