కొండగట్టు ఘటన: షాకింగ్ నిజాలు, అధికారుల చుట్టూ..

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డు ఘటన గురించి ఇప్పుడిప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం డ్రైవరేనని తొలుత వార్తలొచ్చాయి. తాజాగా బస్సుకు ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే ఈ ఘోరం సంభవించిందని దర్యాప్తులో తేలింది. బస్సు కండక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. గట్టు నుంచి బస్సు బయలుదేరగానే తొలుత స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి. అక్కడే బ్రేక్ ఫెయిలైంది. ఈలోగా బస్సు లోయలోకి వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ సమయంలో బస్సు సుమారు 100 కి.మీల వేగంతో వెళ్తోందని, కళ్లు తెరిచి చూసేలోపు లోయలో వున్నట్లు వెల్లడించాడు. బ్రేక్ ఫెయిల్, స్టీరింగ్ విరిగిపోవడంతో డ్రైవర్ ఏమీ చేయలేకపోయాడు. అధికారుల ప్రాథమిక విచారణలో కూడా బ్రేక్ ఫెయిలేనని తేలింది.

2007 మోడల్‌కు చెందిన ఈ బస్సు.. 12 లక్షల కి.మీలు మాత్రమే ప్రయాణించాలి. ఐతే, ఈ బస్సు 14 లక్షల కి.మీలు తిరిగింది. ఈ క్రమంలో బస్సును కాలం చెల్లిన బస్సుగా పరిగణించి, ఘాట్ రోడ్లపై నడపరాదు. వీటి అన్నింటికీ ఆర్టీసీ అధికారులు తిలోదకాలిచ్చి, కాసుల కోసం బస్సును ఘాట్ రోడ్డు పైకి తీసుకొచ్చారు. ఫలితంగా 62 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దేశంలో బస్సు ప్రమాదాల చరిత్రలో ఎక్కువమంది చనిపోయిన ఘటన ఇది.

Related News