నిండిపోయిన కల్వకుంట్ల ఖజానా

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీద అతని కుటుంబ సభ్యుల మీదా ఆ పార్టీ తిరుగుబాటు నేత, వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ సమరశంఖం పూరించారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాదు సంచలన ఆరోపణలకు దిగారు. వేమన పద్యంతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. టిక్కెట్ ఇవ్వకుండా అవమానించడమే కాదు, తీవ్రస్థాయిలో తమకు అన్యాయం చేశారంటూ కొండా సురేఖ వాపోయారు. కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని, బీసీ మహిళనయిన తనకు నమ్మకద్రోహం జరిగిందన్నారు. కేబినెట్‌లో మహిళలకు స్థానం లేదని, కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ కు రాలేదన్నారు. అతనికి గోలీలు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారని.. తాను అడిగిన ప్రశ్నలకు 12 రోజులైనా సమాధానం లేదని విమర్శించారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.

కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ పదవులు దక్కాయని, నాలుగేళ్ళలో కేసీఆర్ ప్రజాప్రతినిధులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. సోనియాగాంధీ అపాయింట్ మెంట్ ఆపార్టీ నేతలకే దొరకదని ఎద్దేవా చేస్తున్న కేసీఆర్ దీనికి ఏం చెప్తారంటూ ప్రశ్నలు సంధించారు. నాలుగు గంటలు నిరీక్షిస్తే సోనియా, రాహుల్‌ను కలవొచ్చన్న ఆమె, కనీసం కేటీఆర్ కూడా అపాయిట్మెంట్ ఇవ్వరని చెప్పుకొచ్చారు. లష్కర్‌ బోనాలకు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవితకు అర్హత ఏంటని ప్రశ్నించారు. కుమారుడికి పట్టం కట్టేందుకు కేసీఆర్‌ ఆరాటపడుతున్నారన్నారు. కేసీఆర్‌ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, ప్రతి పనికి కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కమీషన్లతో కల్వకుంట్ల ఖజానా నిండిపోయిందన్నారు. ఉద్యమంలో కోదండరాంను పొగిడినవాళ్లు.. ఇప్పుడు చవట అంటూ దూషిస్తున్నారని విమర్శలు చేశారు. కేటీఆర్, కవిత నేతలు కావాలని తెలంగాణ ప్రజలు ఏనాడూ కోరుకోలేదన్న ఆమె, మా కూతురు ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

Related News