కేరళకు యూఏఈ సాయం రూ. 700 కోట్లు

భారీ వరదలతో సర్వం నాశనమైన కేరళను ఆదుకునేందుకు పొరుగు రాష్ర్టాలే కాకుండా విదేశాలు సైతం సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా యూఏఈ సర్కార్.. పునరావాస సహాయకచర్యల కోసం రూ.700 కోట్లను ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు కేరళ సీఎం పినరయి విజయన్‌ మంగళవారం తెలిపారు.

అంతకుముందు కేరళ వరదలపై ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. ‘యూఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో వుందని, వాళ్లని తప్పకుండా ఆదుకుంటామని అందులో వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకుంది.

ఇప్పటివరకు 400 మందికి పైగానే చనిపోయినట్టు అధికారికంగా చెబుతూనే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 43,000 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో దాదాపు 12.5 లక్షల మంది తల దాచుకుంటున్నారు. వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో సహాయకచర్యలు జోరుగా సాగుతున్నాయి.

Related News