గణేష్ నిమజ్జనం తర్వాతే.. రంగంలోకి గులాబీ బాస్

తెలంగాణలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తెరలేవనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసిన గులాబీ బాస్, ప్రచారానికి రెడీ అవుతున్నారు. సెకండ్ లిస్ట్ తర్వాతే ప్రచారంలోకి దిగాలని ప్లాన్ చేసినప్పటికీ, అవన్నీ కీలక నియోజకవర్గాలు కావడంతో ఆలోచనలో పడింది టీఆర్ఎస్ అధినాయకత్వం. ఇందులోభాగంగా ఈనెల 24 నుంచి ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 23వ వరకు వినాయక నిమజ్జనం వుండడంతో అప్పటి వరకూ ఎక్కడ ప్రచారం చేయరాదని నిర్ణయించారు సీఎం కేసీఆర్.

మొత్తం 50 సభలను నిర్వహించాలని స్కెచ్ వేసింది టీఆర్ఎస్. ఉత్తర తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఎన్నికల సభ పెడితే బాగుంటుందన్న దానిపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. ఇక మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వీలైన్నని భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతాల నుంచే టీఆర్ఎస్‌తోపాటు మహాకూటమి ముఖ్యనేతలు బరిలోకి దిగనున్నారు. మొత్తానికి అభ్యర్థుల తొలి జాబితాని రిలీజ్ చేసే విషయంలో గులాబీ బాస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, సభల ఏర్పాటులోనూ అదే విధంగా దృష్టి సారించడం కొసమెరుపు.

Related News