కేసీఆర్ చెప్పిందే కరెక్ట్ : ఈసీ

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నానని ప్రకటించిన మొదటి ప్రెస్ మీట్లో కేసీఆర్.. ఎలక్షన్ తేదీల్ని కూడా ప్రకటించేశారు. సీఈసీతో నేను మాట్లాడే చెబుతున్నానంటూ అప్పుడు కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏర్పాట్ల మీద పర్యవేక్షణ కోసం హైదరాబాద్ కొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. వెళ్తూవెళ్తూ కొంత క్లారిటీ ఇచ్చేశారు. ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ మేరకు ఇక్కడ సరంజామా సిద్ధంగా ఉందని చెప్పారు. అక్కడితో ఆగకుండా అక్టోబరు రెండోవారంలో షెడ్యూల్ విడుదల చేస్తామని, డిసెంబర్ రెండోవారంలోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, కొత్త ప్రభుత్వాలకి రూట్ క్లియర్ అవుతుందని ఒక సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థ చెవిలో ఊదేశారు. ‘అక్టోబర్లో నోటిఫికేషన్, నవంబర్లో పోలింగ్, డిసెంబర్లో ఫలితాలు’ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలేనని రుజువైపోయింది. ఇటు.. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ గురించి కేసీఆర్ తో ఎలా మాట్లాడుతుందంటూ తెలంగాణ కాంగ్రెస్ లొల్లి షురూ చేస్తోంది. వీలయితే ఎన్నికల నిలుపుదలకు సైతం న్యాయపోరాటం చేస్తామని టీపీసీసీ నేతలు నడుం కట్టేశారు.

Related News