గాంధీభవన్‌కి తాళాలెయ్యండి!

మొత్తానికి హైదరాబాద్‌ని క్లీన్ స్వీప్ చేసేశారు సీఎం కేసీఆర్. సిటీ ఐకాన్ లీడర్లలో ఒకరైన దానం నాగేందర్‌ని చెరబట్టడం ద్వారా.. క్లయిమాక్స్‌ని కూడా కానిచ్చేసుకున్నారు. అర్బన్ ఓటుబ్యాంకుని, పనిలోపనిగా సెటిలర్ల సెంటిమెంటును కూడా దోచేసిన టీఆరెస్ పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని జీరో సైజుకు చేర్చడమనే ఆపరేషన్ మీద బిజీగా వుంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ.. దానం చేసిన ఒక వ్యాఖ్య.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ని కెలికిపారేస్తోంది. ‘కాంగ్రెస్‌లో కుమ్ములాటలే తప్ప కలిసి పనిచేద్దామన్న కమిట్మెంట్ లేదు..” అంటూ ఒక నగ్నసత్యాన్ని చెప్పారాయన. అక్కడితో ఆగకుండా.. ‘సీఎం అభ్యర్థిని ప్రకటించమనండి.. పార్టీ నుంచి పదిమంది లీడర్లు బైటికొస్తారు’ అనేశారు దానం.

కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే మేస్త్రీలు. పీసీసీ రేసులో ఎప్పుడూ అరడజను మంది పోటీ పడతారు. విచిత్రంగా.. లెజిస్లేటివ్ లీడర్ జానారెడ్డి సీటుకే ముగ్గురు ఎర్త్ పెట్టేస్తున్నారు. ఈ లెక్కన రేపటి ఎన్నికల్లో గెలిస్తే ఫలానా వాళ్ళకే సీఎం కుర్చీ అంటూ అధిష్టానం ప్రకటిస్తే.. గాంధీభవన్ ఖాళీ అయిపోవడం ఖాయం. పేరుకే ప్రధాన ప్రతిపక్షం.. చేతిలో వున్నది మాత్రం 13 ఎమ్మెల్యే సీట్లు. నిజానికి.. పార్టీలో పట్టుమని పదిమంది కూడా పెద్దలు లేరు. మరి.. దానం హెచ్చరిక చేస్తున్నట్లు.. ‘పారిపోయే పది మంది’ ఎవరన్న లెక్క తేల్చడం కూడా కష్టమేమీ కాదు. సో.. కేసీఆర్ సైలెంట్‌గా అనౌన్స్ చేసిన ‘ఆపరేషన్ ఆకర్ష్ 2’ కనుక మొదలైతే.. గాంధీభవన్‌కి ‘టు లెట్’ బోర్డు పెట్టక తప్పదేమో!

Related News