‘పవన్ మీడియా’ రెడీ..!

ఏపీ పాలిటిక్స్‌కీ, తెలుగు మీడియాకీ మధ్య ఎప్పట్నించో ఒక అక్రమ సంబంధం బిగుసుకుపోయింది. పచ్చ మీడియా అనీ, సాక్షి మీడియా అనీ రెండుగా విడదీసి చూడ్డం జనానికి సైతం అలవాటైపోయింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఏర్పడ్డ ఈ విభజన రేఖ ఇప్పటిది కాదు. ఇటీవల మిగతా పార్టీలు సైతం టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లంటూ కొత్త ‘వ్యాపారం’ మొదలుపెట్టేశాయి. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిన జనసేన కూడా మీడియా మీద మోజు పెంచుకున్నట్లు కొన్ని వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక తెలుగు టీవీ ఛానెల్‌ని టేకోవర్ చేసి.. టెంకాయ కొట్టడం కూడా జరిగిపోయిందన్నది బ్రేకింగ్ న్యూస్.

తాజాగా 99టీవీని దక్కించుకున్న మీడియా గ్రూప్‌లో జనసేన సెక్రెటరీ తోట చంద్రశేఖర్‌ది కీలక పాత్ర. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా, వ్యాపారవేత్తగా మంచి పేరున్న తోట చంద్రశేఖర్.. ఈ ఛానెల్‌లో పెట్టుబడులు పెట్టడం జనసేనకు పరోక్ష ప్రయోజనం దక్కించడం కోసమేనన్నది గమనార్హం. ఇది కాకుండా.. మరో రెండు ఛానళ్లతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు జనసేన వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మూడు ఛానెళ్లలో జనసేన వాయిస్ వినిపించడం ద్వారా జనంలోకి బాగా చొచ్చుకుపోవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ‘పవన్ మీడియా’ అనేది ఏర్పడితే.. ఆ తర్వాత కవరేజ్ సమస్య దానంతటదే సమసిపోతుందని జనసేన భావిస్తోంది.

Related News