రూ. 15 లక్షల సొమ్ము చేతులు మారింది

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాస్‌పోర్టులు, మనుషుల అక్రమ రవాణా వ్యవహారం కేసు మలుపులమీద మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. 2016‌లో ఆయన ఎమ్మెల్యే లెటర్ హెడ్‌తో పాస్‌పోర్టులు పొందారని, కుటుంబ సభ్యుల పేర్లతో ఇతరులను అమెరికాకు పంపారని పోలీసులు చెబుతున్నారు. ఈ యవ్వారంలో రూ. 15 లక్షల డబ్బు చేతులు మారిందని, ఒక్కొక్కరి దగ్గర తాను రూ. 5 లక్షలు తీసుకున్నట్టు జగ్గారెడ్డి ఒప్పుకున్నారని వారు చెప్పారు. తన కూతురు 1997‌లో పుట్టినట్టు ఆయన పేర్కొన్నారని, కుమారుడు 2000 సంవత్సరంలో పుడితే 1989‌లో పుట్టినట్టు చూపారని, ఆధార్ కార్డుల డేటా ప్రకారం ఈ సమాచారం సేకరించామని వారన్నారు. తన భార్య టి.నిర్మల పేరుతో మరొకరి  ఫోటో అంటించి పాస్ పోర్టు పొందారన్నారు. 2004 లో నకిలీ పత్రాలు సృష్టించి ఈ బాగోతానికి ఆయన తెర తీశారు. ఫేక్ వ్యక్తుల్ని మధు అనే బ్రోకర్ తీసుకొచ్చాడని ఆయన చెప్పారని  పోలీసులు వెల్లడించారు. జగ్గారెడ్డిపై ఇమ్మిగేషన్, పాస్‌పోర్టు చట్టాల కింద కేసు నమోదు చేశామని, పాస్‌పోర్టు ఆఫీసును కూడా సంప్రదించామని ఖాకీలు పేర్కొన్నారు. జగ్గారెడ్డిపై  ఐపీసీ సెక్షన్లు 419, 490, 467, 468, 471, 37, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 24 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Related News