ప్యాకేజీకి బాబు ఎలా ఓకే చెప్పారు?-జగన్ ప్రశ్న

ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. హోదాకు బదులు ప్యాకేజీ చాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. ఆ హక్కు ఆయనకు ఎవరిచ్చారు? ఈ విషయంలో రాజీ పడటానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం సందర్భంగా శుక్రవారం లోక్‌సభలో మాట్లాడిన పీఎం మోదీ, చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పిన విషయాన్నిగుర్తుచేశారు. హోదా అవసరంలేదని మహానాడులో తీర్మానం చేయలేదా? జైట్లీకి కృతజ్ఞతలు చెప్పలేదా? కేంద్రాన్ని అభినంధిస్తూ తీర్మానం చేయలేదా? ఇలా నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.

ఏపీ ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం కేంద్రం, చంద్రబాబుకు ఎవరిచ్చారని దుయ్యబట్టారు జగన్. రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్సేనని, హోదాపై అరనిమిషం కూడా సభలో రాహుల్ మాట్లాడలేదన్నారు. ఐదుకోట్ల మంది ప్రజలు వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు దొరక్క, ఎక్కడికి వెళ్లాలో తెలియక వలస బాట పడుతున్నారని మండిపడ్డారు. హోదా విషయంలో ప్రభుత్వం వైఖరికి నిరసిస్తూ ఈనెల 24న అంటే మంగళవారం ఏపీ బంద్‌కి పిలుపునిచ్చారు జగన్. దీనికి ప్రజాసంఘాలు, ప్రజలు, రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు.

Related News