టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి ఇంటిపై ఐటీ సోదాలు

తెలంగాణలో ఎన్నికల ముందు ఇదొక హాట్ న్యూస్. టీఆర్‌ఎస్‌ నేత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిజినెస్ ఆఫీసులపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేసింది. ఏకకాలంలో 18 చోట్ల సోదాలు చేసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఆ కంపెనీ ఆఫీస్‌తోపాటు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఇతర సంస్థలు, ఖమ్మం జిల్లా గొల్లగూడెంలోని ఎంపీ ఇల్లు, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

కీలక డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి సంబంధించి ఈ ఏడాది రూ.1800 కోట్ల టర్నోవర్‌ను చూపించారు. దీనికి పూర్తిస్థాయి పన్ను చెల్లించారా లేదా అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బుధవారం కూడా తనిఖీలు జరిగే ఛాన్స్ వుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆ కంపెనీకి భార్య మాధురి, కొడుకు హర్ష, డైరెక్టర్లుగా వుండగా, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థ.. ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది. పొంగులేటి కుటుంబం మరికొన్ని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలను నిర్వహిస్తోందని ఐటీ వర్గాలు చెబుతున్నమాట. 2014లో వైసీపీలో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన పొంగులేటి, 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల సందర్భంగా పొంగులేటి సమర్పించిన అఫిడవిట్‌ను ఐటీ అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది.

Related News