ఏపీపై ఐటీ పంజా, రేపోమాపో నేతల ఇళ్లపై!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగేశారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న 10 ఐటీ బృందాలు, శుక్రవారం ఉదయం నుంచి రంగంలోకి దిగేశారు. పోలీసుల సహాయంతో విజయవాడ, గుంటూరుల్లోని వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రైల్వే కోచ్‌ల మరమ్మతులు, నిర్మాణాలను చేపడుతోంది ఈ సంస్థ.

అలాగే హైదరాబాద్‌కి చెందిన సదరన్ కన్‌స్ర్టక్షన్ కంపెనీకి సంబంధించి విజయవాడలోని ఆ కంపెనీ ఆఫీసు, ప్రతినిధుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారీ కంపెనీలోనూ సోదాలు చేస్తున్నారు. మరోవైపు బెంజ్‌సర్కిల్ నారాయణ జూనియర్ కళాశాలకు వెళ్లిన ఐటీ బృందం, అకౌంట్ల నిర్వహణ సిబ్బందిని అందుబాటులో వుంచాలని సూచించింది.

 

అమరావతిలో భూములు కొన్నవాళ్లపైనా?

 

గత రెండు మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణ రంగ లావాదేవీలు జరిపారు కొందరు వ్యక్తులు. నాలుగేళ్లకు ముందు అమరావతి శివార్లలో పొలాలను కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నవాళ్లపైనే ఐటీ ఫోకస్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో 50 ఎకరాలకు మించి కొనుగోలు చేసిన వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఇప్పటికే సేకరించిన అధికారులు, వాటి గుట్టు రట్టు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.

 

లిస్ట్‌లో రాజకీయ, బిజినెస్, అధికారులు?

 

కంపెనీల తర్వాత రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఫోకస్ చేయాలని ఆదాయపు పన్నుశాఖ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మంత్రులతోపాటు పలువురు నేతలు, బిజినెస్‌మేన్లు, అధికారులు కూడా ఈ లిస్ట్‌లో వున్నట్టు అంతర్గత సమాచారం. ఐతే, వాళ్లు ఎవరన్నది తెలియరాలేదు. మొత్తానికి ఒకేసారి ఐటీ బృందాలు ఏపీకి పెద్ద ఎత్తున రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సామాన్యుల్లో మొదలైంది. టీడీపీకి సన్నిహితంగావున్న బడా బిజినెస్ మేన్లను ఐటీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు చోట్ల అధికారులు దాడులు ప్రారంభించారు.

Related News