నిరవ్ మోదీ దుకాణంలో నగలు కొన్నందుకే.. దాడి!

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచి విదేశాల్లో దాక్కున్న వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీ.. ప్రధాని నరేంద్ర మోదీకి ‘బాగా’ ఉపయోగపడ్తున్నారు. ఆ మోదీ పేరు చెప్పి ఈ మోదీ పాల్పడే అఘాయిత్యాల పరంపర ఎంతంటే ఏం చెప్పగలం..? వివరాల్లోకెళదాం..! ఆమ్ ఆద్మీ మాజీ నేత యోగేంద్ర యాదవ్ బీజేపీ ప్రభుత్వం మీద దండయాత్ర మొదలుపెట్టారు. రైతుల పక్షం నిలబడి ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర నాలుగోరోజుకు చేరుకుంది. నన్ను గట్టిగా ఢీకొట్టలేక.. నా చెల్లెలికి చెందిన ఒక నర్సింగ్ హోమ్ మీద ఐటీ అధికారులతో దాడి చేయించిందంటూ.. నిన్న యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. దీంతో డిఫెన్స్‌లో పడిపోయిన మోదీ సర్కార్.. కొత్త రాగం అందుకుంది.

నిరవ్ మోదీ నగల దుకాణంలో సొమ్ములు కొనుక్కుని నగదు రూపంలో బిల్లు చెల్లించబట్టే.. యోగేంద్ర బంధువులపై అనుమానం వచ్చిందని, అందుకే ఐటీ రైడ్స్ చెయ్యాల్సి వచ్చిందని వివరణ వచ్చింది. యోగేంద్ర యాదవ్ చెల్లెలి కొడుకు దగ్గర రూ. 22 లక్షల కరెన్సీ దొరికిందని, నిబంధనల ప్రకారం ఒక ఇండివిడ్యువల్ వద్ద రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు ఉండకూడదని ఐటీ అధికారులు చెబుతున్నారు. నిరవ్ మోదీకి చెందిన దుకాణంలో ఆరున్నర లక్షలకు నగలు కొనుగోలు చేసిన యోగేంద్ర మేనల్లుడు రూ. 3.25 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్నది అధికారుల వాదన. ఐటీ శాఖ ఇస్తున్న సంజాయిషీ చూసి.. జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మాత్రం దానికే 40 మంది ఐటీ అధికారులు ఆకస్మికంగా ఇళ్ళమీద పడి దాడులు చేస్తారా? అన్నది అక్కడ పడిపోతున్న ఎదురు ప్రశ్న.

Related News