మళ్లీ తిప్పలు, ఆన్‌లైన్ రిజర్వేషన్‌కు ఐఆర్‌సీటీసీ న్యూరూల్స్

ఐఆర్‌సీటీసీలో లాగిన్‌ అయ్యి నిదానంగా టికెట్‌ బుక్‌ చేసుకోవాలనుకుంటే ఇకపై కుదరదు. రైలు టికెట్‌‌ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే కస్టమర్స్ కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. లాగిన అయ్యాక కేవలం 30 సెకన్ల లోపు టికెట్ బుక్ చేసుకోవాలి. రైళ్లలో ఖాళీలు చూసుకొని టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి కేవలం 25 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది! పేమెంట్‌ చేయడానికి మరో ఐదు సెకన్ల సమయం. ఓవరాల్‌గా 30 సెకన్లు. వినియోగదారుడు ఒక ఐడీ మీద నెలకు ఆరు టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ వెరిఫై చేసుంటే నెలకు 12 టికెట్ల వరకు బుక్‌ చేసుకునే సదుపాయం వుంది. నిర్దేశించిన సమయం కన్నా మూడుగంటలు రైలు ఆలస్యంగా బయలుదేరినా, మార్గాలు మళ్లించినా ట్రావెలర్‌కి పూర్తి చార్జీలు తిరిగి ఇస్తారు. ఫస్ట్‌ క్లాస్ లో టికెట్‌ బుక్‌ చేసుకుని సెకండ్‌ క్లాస్‌ లేదా స్లీపర్‌కి మార్చుకుంటే చార్జీల మధ్య ఉన్న తేడాను తిరిగి ఇస్తారు.

ఒక పేరు మీద బుక్‌ చేసుకున్న టికెట్‌.. మరొకరి పేరు మీదకు మార్చుకునే అవకాశం కల్పించింది రైల్వేశాఖ. ప్రయాణానికి 24 గంటల ముందు చీఫ్‌ రిజర్వేషన్‌ సూపర్‌వైజర్స్‌ అనుమతితో తమ కుటుంబసభ్యుల పేరు మీదకు ఆ టికెట్‌ మార్చుకోవచ్చు. ఇక ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్‌ క్లాస్‌ బుకింగ్ 11 గంటలకు మొదలుకానుంది. ఒక యూజర్‌ ఐడీపై రెండు టికెట్లు మాత్రమే పొందవచ్చు.. అదీ ఉదయం 10-12 గంటల మధ్యలో మాత్రమే! ప్రత్యేక సమయంలో రెండు స్టేషన్ల మధ్య దూరాన్ని బట్టి ఒక ఐడీ మీద ఆరు బెర్తులు బుక్‌ చేసుకునే అవకాశముంది. తిరుగు ప్రయాణం మినహాయించి ఒక సెషన్‌లో ఒక తత్కాల్‌ టికెట్‌ మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్విక్‌బుక్‌ సర్వీస్‌ అందుబాటులో ఉండదు. ఉదయం 8 నుంచి 8.30 గంటలు, 10 నుంచి 10.30 గంటలు, ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య మాత్రమే ఏజెంట్లు టికెట్లు బుక్‌ చేయాలి. తత్కాల్‌ రిజర్వేషన్‌ ప్రారంభమైన 30 నిమిషాల వరకు వాళ్లకి బుకింగ్‌కు అనుమతి ఉండదు. కొత్త రూల్స్ ప్రకారం ఆన్‌లైన్‌లో టికెట్ చేసుకోబోయే వినియోగదారుడికి తిప్పలు తప్పవనే అంటున్నారు.

Related News