బాబుకి-జగన్‌కి తేడా ఐదుశాతం, పవన్‌కీ ఐదుశాతం!

2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు ఏమంటున్నారు? మళ్లీ బాబుకే పగ్గాలు అప్పగిస్తారా? జగన్‌కి ఛాన్స్ ఇస్తారా? కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పవన్ పాత్ర ఏమిటన్న దానిపై ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ పేరుతో సర్వే చేట్టింది ఇండియా టుడే. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్‌ని ప్రజలు కోరుకుంటున్నట్టు తేలింది. జగన్‌కు 43శాతం ప్రజలు మద్దతు వుండగా, సీఎం చంద్రబాబుకు 38శాతం మంది మాత్రమే! అంటే బాబుకి-జగన్‌కి మధ్య తేడా కేవలం ఐదుశాతం. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వైపు ఐదుశాతం ఓటర్లు మొగ్గు చూపారు.

చంద్రబాబు పాలన బాగుందని 33 శాతం చెప్పగా, బాగా లేదన్నది 36 శాతం మంది. యావరేజ్‌గా వుందన్నవాళ్లు 18 శాతం. సెప్టెంబర్ 8-12 తేదీల మధ్య ఈ సర్వే చేపట్టింది ఆ సంస్థ.ఇందుకోసం 10,650 శాంపిల్స్ తీసుకుంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలుగా ఉన్నాయి. ఏపీ ప్రజల మద్దతు ప్రధాని అభ్యర్థిగా ఎవరన్న దానిపై కూడా ఓ స్పష్టత వచ్చింది. ప్రధానిగా రాహుల్ ఉంటే బాగుంటుందని 44శాతం మంది అభిప్రాయపడగా, మోడీకి 38శాతం మంది మద్దతు తెలిపారు. ఈ సర్వేపై ఏపీలో రాజకీయ చర్చ మొదలైంది. 2014 ఎన్నికల్లో కూడా జాతీయ మీడియా అంతా జగన్‌కే అనుకూలంగా ఇచ్చారని, చివరకు ఫలితాలు తారుమారయ్యాయని అంటున్నారు. ఐనా, ఎన్నికలకు ఆరేడు నెలలు గడువు వుందని, ఈలోగా ఏమైనా జరగొచ్చని అంటున్నారు.

Related News