అజార్ విక్టరీ.. వివేక్‌కి ఎర్త్

మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు-హెచ్‌సీఏ వివేక్‌కు హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన కుర్చీకి మళ్లీ ఎసరొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గత జనవరిలో జరిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజారుద్దీన్‌పై వివేక్ గెలుపొందారు. ఐతే, వివేక్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్ సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు విరుద్దమంటూ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు అజారుద్దీన్. దీనిపై విచారణ చేపట్టిన అంబుడ్స్‌మెన్, వివేక్ ఎన్నిక చెల్లదని తేల్చేసింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ వివేక్ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. అంబుడ్స్‌మెన్ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివేక్‌కు ఊరట కలిగింది.

ఇంతవరకు బాగానేవుంది. ఐతే, సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ అప్పీలు చేశారు. ఆయన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ వ్యవహారంపై తాజాగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని ఆదేశించారు. ధర్మాసనం తాజా ఉత్తర్వులతో అంబుడ్స్ మెన్ నిర్ణయం అమలులోకి వచ్చినందున వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు.

READ ALSO

Related News