దటీజ్.. దేవరకొండ.!

విజయ్ దేవరకొండ. చేసినవి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో పిచ్చక్రేజ్. కుర్రకారుకి యూత్ ఐకాన్ లా తయారయ్యాడు. సీనియర్ హీరోలే భయపడేంత రేంజ్ లో పోటీ ఇస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఇతగాడి నటనను ఫిల్మ్ ఫేర్ కూడా సర్టిఫై చేసేసింది. అవార్డిచ్చి సత్కరించింది. అయితే, ఆ అవార్డు విషయంలో కూడా.. కొత్త ఆలోచన చేసిన రికార్డు సొంతం చేసేసుకున్నాడీ కుర్రహీరో. అవార్డును వేలం వేసి వచ్చిన సొమ్ము ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేశాడు. ఇతడికేమైనా పిచ్చా.. వచ్చిన మొదటి అవార్డు అపురూపంగా ఉంచుకోకుండా అమ్మేసుకుంటాడేంటనుకున్న వాళ్ల కళ్లు తెరిపించాడు.

తనకు అవార్డు వచ్చిందన్న విషయం తనకు మాత్రమే తృప్తినిస్తుందని, కానీ దాన్ని అమ్మేస్తే వచ్చే డబ్బు ఎందరి జీవితాల్లో తృప్తిని మిగుల్చుతుందో తలుచుకుంటేనే లెక్కలేనంత ఆనందం కలుగుతోందన్న విజయ్.. రూ.25 లక్షల రూపాయల చెక్‌ను సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేటీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి  అందజేశాడు. తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసివచ్చిన విజయ్ దేవరకొండను మనస్ఫూర్తిగా అభినందించారు కేటీఆర్. విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ ను ఘనంగా సన్మానించడమే కాదు, ఓ బుద్ధుడి ప్రతిమను బహూకరించారు. ఈ విషయాన్ని ఫొటోలతో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఇలాఉండగా, ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36 లోని ‘జూబ్లీ-800’లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదరు అవార్డును వేలం వేయగా ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ లేబొరేటరీస్ అధినేత కిరణ్ దివి భార్య శకుంతల దానిని రూ. 25 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

 

Related News