దేశంలో ప్రకృతి ప్రకోపం

దేశంలో ప్రకృతి ప్రకోపించింది. ఒక్కరోజులోనే 23 మంది ఉసురుతీసింది. గత మూడురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కేరళ, కర్నాటక, యూపీతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, కొండచరియలు కేరళలో బీభత్సం సృష్టించగా, యూపీలో పెనుగాలులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, మిజోరాం అతలాకుతలమయ్యాయి. యూపీలో 15 మంది, కేరళలో నలుగురు, ఈశాన్య రాష్ట్రాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో కురుస్తున్నభారీ వర్షాలకు కోజికోడ్‌ జిల్లా తమరస్సెరి తాలుకాలోని కట్టిపారా గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు.

 

దీంతో ఇప్పటి వరకు వర్షాల వల్ల రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగింది. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్‌గాడ్‌ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అసోంలో వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. దాదాపు లక్ష మంది ప్రజలు వరదల బారినపడ్డారు. దిఫోలు నది ప్రమాద స్థాయిలో ప్రవహించడం వల్ల 37 జాతీయ ప్రధాన రహదారి కొంత మేర మునిగింది. కజిరంగ నేషనల్‌ పార్క్‌లో నీరు నిలిచింది. మణిపూర్‌లోని దాదాపు నలభై నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంఫాల్‌, కొండ ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Related News