విభజన హామీలు కాంగ్రెస్‌తోనే సాధ్యం: కిరణ్‌కుమార్ రెడ్డి

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయగలదని చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు.

ఢిల్లీలో ఈ ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కిరణ్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డికే.  రోశయ్యను సీఎం పదవినుంచి తొలగించి సమర్థుడని భావించిన కిరణ్ ను ఏపీకి మఖ్యమంత్రిని చేసింది అప్పటి అధినేత్రి సోనియా గాంధీ. ఆమె అంచనాలకు తగ్గట్టుగానే కిరణ్ పనిచేశారు కూడా. అయితే, రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ అధిష్ఠాన నిర్ణయంతో విభేదించిన కిరణ్‌.. 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేశారు.

అదే ఏడాది మార్చి 12న జై సమైక్యాంధ్ర పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను నిలిపిన ఆయన.. తాను బరిలో నిలబడలేదు. తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆపార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

 

Related News