ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు..

ఉత్తరాదిని కుదిపేసిన వరదలు ఇప్పుడు దక్షిణాదిన తమ ప్రతాపం చూపుతున్నాయి. కేరళను అస్తవ్యస్తం చేసి, కర్నాటక మీద కూడా విరుచుకుపడుతున్న జలప్రళయం, పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రకోపిస్తోంది. దాదాపు 15రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు ఇప్పుడు వరద రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ్మిలేరు జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో లింగరావు గూడెం వద్ద గండి పడింది.

డ్యామ్‌లోని నీరు మదేపల్లి, జలిపుడి గ్రామాల్లోకి చేరింది. దెందులూరు మండలం కొవ్వలిలో వెయ్యి ఎకరాల పంట నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళవారం కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నదిలోకి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, విజయవాడ సహా పలు పట్టణాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు, తెలంగాణలో విస్తారంగా మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related News