కుబేరుల జాబితాలు తారుమారు.. టాప్-3లో మార్క్ జుకర్‌బర్గ్

టెక్నాలజీ పుణ్యమాని ప్రపంచంలో కుబేరుల జాబితాలు తారుమారవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫేస్‌బుక్‌ కో-ఫౌండర్ మార్క్‌ జుకర్‌బర్గ్ అడుగుపెట్టేశాడు. ఫస్ట్ ప్లేస్‌ జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌.కామ్‌ వ్యవస్థాపకులు)ది. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ రెండో స్థానం కాగా, జుకర్‌బర్గ్‌ థర్డ్ ప్లేస్‌కి చేరినట్టు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈ విషయంలో అమెరికన్‌ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ను అధిగమించారు జుకర్‌బర్గ్.

శుక్రవారం ఫేస్‌బుక్‌ కంపెనీ షేర్లు 2.4శాతం పెరగడంతో జుకర్‌ ఆస్తి రెట్టింపయ్యింది. ఇక సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాల్లోనూ టెక్నాలజీ అధినేతలే వుండడం గమనార్హం. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక డబ్బున్న వ్యక్తిగా పేరుగడించిన బఫెట్‌ ఆస్తి క్రమంగా తగ్గిపోతోంది. ఈ మధ్యకాలంలో 290 మిలియన్‌ డాలర్ల విలువ చేసే తన కంపెనీ షేర్లను ఛారిటీలకు ఇచ్చారు బఫెట్‌. మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా జీవితకాలంలో తన ఫేస్‌బుక్‌ వాటాలోని 99 శాతం షేర్లను ఛారిటీలకు ఇస్తానని గతంలో వెల్లడించిన విషయం తెల్సిందే!

Related News