క్రిమినల్ కేసులుంటే కష్టాలే ! ఈసీ కొరడా

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే నిర్ణయమొకటి తీసుకొంది కేంద్ర ఎన్నికల సంఘం. తమపై పెండింగ్ కేసులున్నట్టు న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ లో వచ్చిన వార్తల తాలూకు వివరాలను తప్పనిసరిగా అఫిడవిట్ లో ప్రచురిస్తే తప్ప.. వారు నామినేషన్ దాఖలు చేయడానికి వీలు లేదని ఈసీ తాజాగా హెచ్చరించింది. క్రిమినల్ కేసులున్న క్యాండిడేట్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించేలా చట్టం చేసే బాధ్యత పార్లమెంటుదేనని సుప్ర్రీంకోర్టు గత సెప్టెంబరులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ రూలింగ్ లో కొన్ని మార్పులు కూడా చేసింది.

ఎన్నికలకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని మార్గదర్శకాలు, మార్పులు చేయాలని ఈసీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఈ కొత్త గైడ్ లైన్ ని రూల్స్ లో చేర్చింది. అభ్యర్థులు తమ గవర్నమెంట్ అకామడేషన్ డ్యూలను, ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, జీఎస్టీ వంటి వివరాలను తప్పనిసరిగా అఫిడవిట్ లోని ఫాం-26 లో పొందుపరచాలని కూడా ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తమ ఆస్తుల మూలాదాయాన్ని కూడా వాళ్ళు వివరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ పెండింగ్ క్రిమినల్ కేసుల డీటైల్స్ ను సి.1 ఫార్మాట్ లో పేర్కొనవలసి ఉంటుందని, ఈ కాలమ్ ని నింపకుండా వదలివేసే వీలు లేదని ఎన్నికలకు సంబంధించిన నిపుణుడొకరు స్పష్టం చేశారు.

Related News