ఎత్తుకు పైఎత్తు..కిమ్‌కు షాకిచ్చిన ట్రంప్

ఉత్తరకొరియాకు ఊహించని షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్. ఇటీవల కిమ్ ఇచ్చిన ప్రకటనలో విపరీతమైన ఆగ్రహం ప్రదర్శించారని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చేనెల 12న సింగపూర్‌లో జరగనున్న ఇరు దేశాధినేతల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్‌కు లేఖ రాశారు ట్రంప్. కిమ్ బహిరంగంగా శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అందులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చర్చలు జరపడం సరైనది కాదని, శాంతి సాధించగలిగే అవకాశాన్ని నార్త్ కొరియా కోల్పోయిందని పేర్కొన్నారు.

అణుపరీక్షలతో ప్రపంచాన్ని హడలెత్తించిన ఉత్తరకొరియాని దారికి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అమెరికా. ఇందులోభాగంగా చర్చల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. ఇరుదేశాల అధ్యక్షులు భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఐతే, కిమ్‌తో భేటీపై అమెరికా కొన్ని షరతులు విధించింది. ఉత్తరకొరియా అణుకార్యక్రమాలు నిలిపివేయాలన్నది ప్రధాన డిమాండ్. అణ్వాయుధాలను వదిలేయాలని మరింత ఒత్తిడి చేస్తే తాము చర్చల నుంచి వైదొలగుతామని హెచ్చరించింది ఉత్తరకొరియా. కానీ, గురువారం వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టుల సమక్షంలో ఉత్తరకొరియా ఓ అణుపరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కిమ్‌తో భేటీని రద్దు చేసుకున్నట్లు ట్రంప్‌ ప్రకటించడం కొసమెరుపు.

 

Related News