జక్కన్న కొత్త బిజినెస్..! సినిమాలకు దూరం!

ఒక్క సినిమాతో ప్రపంచం దృష్టిలో హీరోగా మారి.. ఇండియన్ సెల్యులాయిడ్‌తో కబడ్డీ ఆడేసుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ఒరిజినల్ కబడ్డీలోకే దిగేశారు. మన దేశీయ క్రీడ కదా ప్రోత్సహిద్దామనుకున్నాడో లేక.. ఆఫ్‌బీట్ ప్రొఫెషన్‌గా బాగుంటుందనుకున్నాడో లేక.. కొడుకు అభిరుచితో ఏకీభవిద్దామనుకున్నాడో.. ఏదైతేనేం.. రాజమౌళి ఇప్పుడు కబడ్డీ మీద పడ్డాడు. పైగా నేను ‘పక్కా లోకల్’ అంటూ నల్లగొండ ఈగల్స్ క‌బ‌డ్డీ జ‌ట్టును కొనేసుకున్నాడు కూడా.

జక్కన్న ‘ఎంట్రీతో’ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్‌2 విచ్చలవిడిగా ప్రమోట్ అవుతోంది. నిర్మాత సాయి కొర్రపాటి, కొడుకు కార్తీకేయలతో కలిసి రాజమౌళి చేస్తున్న ప్రమోషన్.. తన సొంత టీమ్‌తో పాటు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ మొత్తానికీ ఊపునిస్తోంది. జక్కన్న తన క్రియేటివిటీ మొత్తాన్ని కుమ్మరించి టీమ్ ప్రమోషన్‌ని సినిమాటిక్‌గా నిర్వహిస్తున్నారు. ఓ థీమ్ సాంగ్‌ని కూడా రిలీజ్ చేశారు.

ఈ నెల 14 నుంచి 16 రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్‌2లో మొత్తం 8 జ‌ట్లు పార్టిసిపేట్ చేస్తున్నా.. అందరి కళ్ళూ రాజమౌళి కొనుక్కున్న ‘నల్గొండ ఈగల్స్’ జట్టు మీదే వున్నాయి. కబడ్డీ ప్రేమికులతో పాటు.. ఫిలింనగర్ వర్గాలు సైతం ఇప్పుడు సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

Related News