మీనమేషాలు లెక్క పెడుతున్న కాంగ్రెస్

తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో అధికార తెరాస అప్పుడే రంగంలోకి దిగి అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచార శంఖాలు పూరించగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. టీడీపీ, సీపీఐ , టీజేఎస్ పార్టీలతో జట్టుకట్టి మహాకూటమిని ఏర్పాటు చేసిన ఈ పార్టీ..ఇంకా అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపిణీ వంటివి ఎటూ తేలక, ‘ బాలారిష్టాల ‘ తోనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. రోజూ ‘ మిత్ర పక్షాల ‘ మధ్య చర్చలైతే కొనసాగుతున్నాయి. కానీ..ఎన్నికల దూకుడు మాత్రం ప్రారంభం కాలేదు. పార్టీ టికెట్ల కోసం ఆశావహులంతా అదేపనిగా ఎదురుచూస్తున్నారు. టికెట్లను ఆశిస్తున్న వారినుంచి దరఖాస్తులు సేకరించి..వాటిని స్క్రీనింగ్ కమిటీకి పంపుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.


భక్త చరణ్ దాస్ నేతృత్వాన గల ఈ కమిటీ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను ఐడెంటిఫై చేసి ఆ లిస్టును పార్టీ అధిష్టానానికి పంపుతుందని. అభ్యర్థుల ఎంపిక నిర్ణయం అధిష్టానానిదేనని తెలుస్తోంది. మరోవైపు-ఈ స్క్రీనింగ్ కమిటీ త్వరలో తెలంగాణాలో పర్యటించి టికెట్లను ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలనుంచి వారి అభిప్రాయాలను సేకరిస్తుందని సమాచారం. అటు-సీట్ల పంపిణీ వ్యవహారం కూడా ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. ఇదంతా చూస్తుంటే..ఈ ఆలస్యం అధికార తెరాసకే అచ్చి వచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు.

READ ALSO

Related News