ఆజాద్ సమక్షంలో లెక్కలు, ఎవరికి ఎన్ని?

ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇటువైపు ఫోకస్ పెట్టారు. ఇందులోభాగంగా బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. ఈ క్రమంలో టీఆర్ఎస్‌లో టికెట్లు లభించని కొందరు నేతలు.. ఆజాద్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పటాన్ చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మురళి వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం. ఇప్పటికే ఆయా నేతలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు.

మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలావుండగా పొత్తుల లెక్కలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే తేలిపోనుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లను కేటాయిస్తారన్నది ఓ కొలిక్కిరానుంది. ఈ నేపథ్యంలో ముందుగానే అంటే మంగళవారం కాంగ్రెస్ నేతలు టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితితో చర్చించనున్నారు.

Related News