రాహుల్‌గాంధీకి ఎర్త్.. ప్రియాంకకు ‘సీటు గ్యారంటీ’..!

మొన్న యూపీ పోయింది.. నిన్న గుజరాత్ పోయింది.. ఇప్పుడు సొంత పిడికిట్లో వున్న కర్ణాటక కూడా జారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో పడిందన్న సానుభూతి వచనాలు వినిపిస్తున్నప్పటికీ.. ‘యాంటీ మోదీ వేవ్’ మొదలైందని, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అచ్చేదిన్ వచ్చేస్తాయన్న భరోసాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే.. ఇప్పుడు కోల్పోతున్న అన్ని రాష్ట్రాలూ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నవే! వీటన్నిటినీ నిలబెట్టుకోవడం కోసం రాహుల్ గాంధీ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. గుడిసెల్లో రోటీలు చప్పరించారు.. అలవాటు లేకపోయినా గుళ్ళూ గోపురాలూ తిరిగారు.

యూపీని, గుజరాత్‌ని, నిన్నటి త్రిపురను సైతం అగ్నిపరీక్షగా భావించి రంగంలో దిగేశారు రాహుల్ గాంధీ. వాటన్నిటితో పాటు.. కాంగ్రెస్ పార్టీ వందశాతం నమ్మకాలు పెట్టుకున్న కర్ణాటక సైతం పరాయి చేతుల్లోకి జారిపోయింది. పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రతిష్టాత్మక ఎలెక్టోరల్ ఫైట్ కర్ణాటకదే! ఇటువంటి కీలక సమయాల్లో ప్రతిసారీ రాహుల్‌కి ప్రత్యామ్నాయం ఎవరన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో తెరమీదకు రావడం సహజం. ఎప్పటిలాగే ఈసారి కూడా రాహుల్ సోదరి ప్రియాంక వైపు ఆర్తిగా చూసింది పార్టీ. ప్రియాంక ఎంట్రీ కోసం కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం వీరలెవల్లో ప్రయత్నాలు చెయ్యడం ఒక బహిరంగ రహస్యం. ఈ గ్రూప్‌కి మళ్ళీ ఇప్పుడు నోట్లో నీళ్ళూరాయి.

గురువారం మీడియా ముందుకొచ్చిన సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్.. ఓపెన్ గానే ప్రియాంక జపం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో యువరాణిదే కీలక పాత్ర అంటూ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. వ్యూహ నిర్మాణంలో ప్రియాంక గాంధీ మరింత క్రియాశీలకంగా వ్యహరించబోతున్నారని సెలవిచ్చారు. సార్వత్రిక ఎన్నికల సీజన్ దగ్గర పడుతుండడంతో.. పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయన్న వార్తల నేపథ్యంలో ప్రియాంక పేరు రీసౌండ్ ఇవ్వడం.. సహజంగానే నేషనల్ మీడియాను ఎట్రాక్ట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో సోనియాకు బదులుగా రాయ్‌బరేలి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఉలిక్కిపడ్డ ఏఐసీసీ.. వెంటనే దిద్దుబాటుకి దిగేసింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే ప్రసక్తే లేదన్నది ఏఐసీసీ తాజా ప్రకటన. పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం.. ఈ రెండూ వేర్వేరు అంశాలని స్పష్టతనిచ్చారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వి. ప్రియాంక విషయంలో కాంగ్రెస్ పార్టీ తడబడ్డం ఇదే మొదటిసారి కాదు. ‘రాహుల్ కంటే ప్రియాంక కరిష్మా గొప్పది.. ఆమె రావాల్సిందే’ అనే నినాదాలు అంతర్గతంగా ఎంత బిగ్గరగా వినబడ్డప్పటికీ.. ‘వస్తాను లేదా రాను’ అనే క్లారిటీ మాత్రం ప్రియాంక నోటినుంచి ఎవ్వరూ ఎప్పుడూ వినలేదు. ఏదేమైనా.. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు విశ్రాంతినివ్వాల్సిన బాధ్యతను, అన్నయ్యను ఒంటరిని చేయకూడదన్న బరువును.. ప్రియాంక మొయ్యక తప్పదన్నది కాంగ్రెస్ పార్టీ బతుకు కోరుకునే వాళ్ళ  బరువైన మాట!

Related News