దానం ‘కారు’ ఎక్కనున్నారా ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ ! పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. అలాగే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికికూడా ఆయన రాజీనామా లెటర్ పంపినట్టు తెలుస్తోంది. తన చర్యకు కారణాలను, తన భవిష్యత్ కార్యాచరణను గురించి దానం నాగేందర్ శనివారం మీడియాకు వివరించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ కీలక నేతగా ఉన్న ఆయన.. 1994, 1999, 2004 సంవత్సరాల్లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి, 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

పార్టీలో బడుగు వర్గాలు, బీసీలకు అన్యాయం జరుగుతోందన్న కారణంగా  పార్టీనుంచి వెళ్లిపోతున్నట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల సంస్థాగత పదవుల భర్తీలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన ఆయన.. పార్టీ అధిష్టానం ఆ పదవిని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారని అంటున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దానం నాగేందర్.. అధికార తెరాస పార్టీనుంచి మంచి ఆఫర్ రావడంతో గులాబీ గూటిలో చేరేందుకు సిద్ధపడినట్టు సమాచారం. బహుశా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం కు ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా కాంగ్రెస్ ను వీడి ‘ కారు ‘ ఎక్కేందుకు దానం యత్నించారని, అయితే చివరి నిముషంలో మనసు మార్చుకున్నారని వార్తలు వచ్చాయి.

Related News