రాములమ్మ కొత్త అస్ర్తం!

వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామంటే.. తామే గెలుస్తామంటూ అధికార టీఆర్ఎస్- మహాకూటమి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈలోగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు హామీలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లవిని ఎత్తుకుంది. తాజాగా నాలుగు కోట్ల ప్రజలు కేసీఆర్‌ను నమ్మి గెలిపిస్తే భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. అంతేకాదు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. దీన్ని అభివృద్ధి అంటారా? దోపిడీనా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతీ పథకంలోనూ అవినీతి జరిగిందని కుండబద్దలు కొట్టేశారు. ఏదో రోజున వాస్తవాలు లెక్కలతోపాటు బయటకొస్తాయన్నారు. అప్పుడు కచ్చితంగా జవాబు మాత్రమే చెప్పాలన్నారు.

ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, మహాకూటమిని మాయాకూటమంటూ టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై తనదైనశైలిలో చెప్పుకొచ్చారు విజయశాంతి. 2009లో మీరు పొత్తు పెట్టుకుంటే అద్భుతమైన కూటమి, అదే కాంగ్రెస్‌ పెట్టుకుంటే మాయాకూటమా అంటూ విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా తెలంగాణని అభివృద్ధి చేయకపోవడం వల్లే తాము అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలవాలంటే ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ పిల్లలు చెబుతున్నారని, ఆ పార్టీ నేతలకు అన్న కేసీఆర్‌ అసలు అప్పాయింట్‌మెంట్ ఇవ్వరని, వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరోవైపు తమ పార్టీల తరపున బాలకృష్ణ, చిరంజీవి ప్రచారానికి వస్తారా లేదా అన్నది తనకు తెలీదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమేనన్నారు.

Related News