దమ్ముంటే ఒవైసీపై పోటీ చెయ్.. అజర్ సవాల్

వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్… గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్‌కు సవాల్ విసిరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజారుద్దీన్ చేసిన ప్రకటనపై అంజన్ కుమార్ మండిపడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ తనదేనని, తాను అక్కడినుంచే బరిలోకి దిగుతానని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశంలో అంజన్ వర్గం దీనిపై పెద్ద ఎత్తున రభస సృష్టించింది. అంజన్ కుమార్ సికింద్రాబాద్ నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కూడా ప్రకటించారు. అయితే .. అజారుద్దీన్ మాత్రం తగ్గేలా లేరు. నేను సికింద్రాబాద్ నుంచే కాంటెస్ట్ చేస్తానని, అంజన్‌కు దమ్ముంటే హైదరాబాద్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయాలని అంటున్నారు.

అజారుద్దీన్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందినవారు కాగా.. అంజన్ కుమార్ హైదరాబాద్ పాతబస్తీలో నివాసం ఉంటున్నారు. ఓల్డ్ సిటీలో సుమారు మూడు దశాబ్దాలుగా మజ్లిస్‌కు మంచి పట్టు ఉంది. అజారుద్దీన్ కూడా ఒవైసీ సామాజివర్గానికి చెందినవారే కావడం, క్రికెటర్‌గా చిరపరిచితులు కావడం వల్ల వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ నుంచే పోటీ చేయాలని కొందరు నేతలు భావిస్తున్నారు. దీనివల్ల ఒవైసీకి చెక్ పెట్టవచ్చునంటున్నారు. కానీ అజారుద్దీన్ మాత్రం సికింద్రాబాద్ తనదే అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ వ్యవహారం నగర కాంగ్రెస్‌లో మరింత వివాదం రేపవచ్చునంటున్నారు.

Related News