‘అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారా’

కర్నూల్ లో ఏపీ సర్కారు శనివారం జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. తాగు, సాగునీటి ప్రాజక్టుల నిర్మాణానికి, నదుల అనుసందానానికి ఏపీ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యతను, రాష్ట్రంలోని వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో జటకట్టి అసెంబ్లీకి రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాఫెల్ విషయంమీదా చంద్రబాబు మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మీరు చేసిన పనికి మన జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోదీని విమర్శించారు. చివరిగా రాష్ట్రంలో నీటి సంరక్షణ గురించి ప్రజల చేత ప్రమాణం చేయించారు. కాగా, ప్రజల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 6 నుంచి జలసిరికి హారతి కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, నదులు, వాగులు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువులు వరకు ప్రతి సాగునీటి పథకాన్ని పూజించే కార్యక్రమమే జలసిరికి హారతి.

Related News