టీటీడీ కబ్జాకు మోదీ కుట్ర, ఇదే నా సవాల్-బాబు

బీజేపీ, కాంగెస్‌‌లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. నాలుగేళ్లుగా ఏపీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని దుయ్యబట్టారు. విభజన తర్వాత కష్టాల్లోవున్న ఏపీని ఆదుకుంటామని చెప్పిన బీజేపీ, అధికారంలోకి వచ్చాక అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెట్టిందని మండిపడ్డారు.

నాలుగేళ్లలో తాము చేసిన అభివృద్ధి-బీజేపీ పాలించిన రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధిని చూడాలని కమలనాధులకు సవాల్ విసిరారు. విజయవాడ వేదికగా ఆదివారం ప్రారంభమైన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఏపీకి బీజేపీ ముమ్మాటికీ నమ్మకద్రోహం చేసిందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా సహాయం చేస్తామని చెప్పిన మోదీ సర్కార్, నిధులు ఇవ్వకుండా నాలుగేళ్లు గడిపేసిందన్నారు.

11 రాష్ర్టాలకు హోదా ఇచ్చిన మోదీ సర్కార్, ఏపీకి నమ్మకద్రోహం చేసిందని, ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌కి కేవలం 3 వేల కోట్లతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు చంద్రబాబు. ఇటు తిరుమల వ్యవహారంపైనా మాట్లాడారు. టీటీడీ వ్యవహారంలో తమ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్కీయాలజీ డిపార్ట్‌మెంట్ చేత నోటీసులు ఇచ్చి, చివరకు ప్రజల్లో రియాక్షన్ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఏపీలోవున్న తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మోదీ సర్కార్ కబ్జా చేయాలని చూస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

అలాగే బీజేపీ సర్కార్ ఇచ్చిన స్లోగన్స్‌ ప్రజలకు పనికిరాలేదన్నారు చంద్రబాబు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్, జన్‌ధన్ ఈ పథకాలన్నీ ఎవరికైనా మేలు చేశాయా? కుంభకోణాలు చేసేవాళ్లని వదిలేశారని, మనీ కొరతని క్రియేట్ చేశారని, ఈ పరిస్థితి ఎప్పుడైనా, ఎక్కడైనా వుందా? అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో అధికారంలోకి వస్తామని గుంటూరు సభలో బీజేపీ నేతలు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు బాబు. ఎవరి మద్దతుతో వస్తారని సూటిగా ప్రశ్నించారు.

అటు కాంగ్రెస్ పార్టీని కూడా వదల్లేదు చంద్రబాబు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలన సమైక్యాంధ్రప్రదేశ్‌కు ఓ పీడకల అని, వాళ్ల హయాంలో ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాల మయంగా మార్చేశారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌ అధికారులు జైలుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేయలేదన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో విద్యుత్‌ కొరత లేకుండా చేశామని, భవిష్యత్తులో విద్యుత్‌ ఛార్జీలు పెంచేదిలేదన్నారు. ఇటు వైసీపీపైనా విరుచుకుపడ్డారు చంద్రబాబు. అభివృద్ధి అంటే తెలియని,  అనుభవం లేని ఓ నేత, కనిపించినదంతా ఇచ్చేస్తానని గాలి హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

Related News