వసంతపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎందుకు?

వైపీసీ నేత వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. వసంత వ్యవహారంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని, హత్యలతో ఏమీ సాధించలేరని అన్నారు. ఇలాంటివాటిని ఎవరు ప్రోత్సహించినా తీవ్రస్థాయిలో చర్యలు వుంటాయని హెచ్చరించారు. రెండురోజుల కిందట గుంటుపల్లి పంచాయితీ కార్యదర్శికి ఫోన్‌ చేసిన వసంత నాగేశ్వరావు బెదిరింపులకు పాల్పడ్డారు. ఐతే, కార్యదర్శి నల్లారి వెంకటనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

 

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు మంత్రి దేవినేని ఉమ. ఈసారి కూడా అక్కడినుంచే బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా వైసీపీలోకి వచ్చిన వసంత నాగేశ్వరరావు కొడుకు కృష్ణప్రసాద్, మైలవరం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ- వైసీపీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. టీడీపీకి పట్టున్న గ్రామాలు ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడిల్లో వైసీపీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫ్లెక్సీల తొలగింపు విషయంలో సెప్టెంబర్ 7న సాయంత్రం వసంత నాగేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శికి ఫోన్‌ చేసి టీడీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నావా అని ఫైర్ అయ్యారు. మీ మంత్రిని (దేవినేని ఉమాను) ఓడించేందుకు ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని, తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీని ఆధారంగా వసంతపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News