సీఐడీ చలువ.. అగ్రిగోల్డ్ బాసులకు బెయిల్

భవిష్యత్ అవసరాల కోసం పనికొస్తుందని ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అగ్రిగోల్డ్ లో మదుపు చేశారు చాలా మంది ప్రజలు. అయితే, ఆ డబ్బు తిరిగిరాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులున్నారు. ఇలాంటి సంచలనాత్మక అగ్రిగోల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తాజాగా తేటతెల్లమైంది.

ఈ కేసుకు సంబంధించి చార్జిషీటును సకాలంలో దాఖలు చేయకపోవడంతో ప్రధాన నిందితులకు మచిలీపట్నం కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ పోలీసులు నిర్దిష్ట సమయంలో చార్జ్‌షీటు దాఖలు చేయడంలో విఫలమయ్యారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదుచేసిన 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి. కానీ, ఏపీ సీఐడీ అధికారులు అలా చేయకపోవడంతో నిందితులుగా ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్ మంజూరైంది. నిందితులు అవ్వా వెంకటరామారావు, అవ్వా ఉదయ్ భాస్కర్, అవ్వా మణిశర్మ, అవ్వా శేషు నారాయణరావు, ప్రసాద్, సాయిరాంకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దాదాపు 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు స్వీకరించిన అగ్రిగోల్డ్ సంస్థ.. మదుపరులకు వడ్డీలు, కాలపరిమితి తీరాక తిరిగి చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వలేని సంగతి తెలిసిందే. దీంతో మదుపరుల ఫిర్యాదులతో తొలుత పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేసు సీఐడీకి బదిలీ చేశారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్లను రక్షించేందుకే సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయలేదని బాధితులు విమర్శిస్తున్నారు.

Related News