చరిత్రకెక్కిన చెన్నై చిన్నది!

దివ్య సూర్యదేవర.. ఒక సాధారణ తమిళమ్మాయి.. కార్పొరేట్ సెక్టార్లో అసాధారణ స్థాయికి ఎదిగింది. మగువలు తల్చుకుంటే సాధించలేనిది లేదనడానికి మరో తార్కాణంగా నిలబడింది. అమెరికాలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ ‘జనరల్ మోటార్స్’కి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా ప్రమోట్ అయ్యింది దివ్య. సెప్టెంబర్ 1న ఛార్జ్ తీసుకోనున్న దివ్య సూర్యదేవర పేరు ఇప్పుడు గ్లోబల్ కార్పొరేట్ రంగంలో బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయింది. ఇప్పుడు సీఈఓగా వున్న 56 ఏళ్ల మేరీ బర్రా అనే ఆవిడకు దివ్య రిపోర్ట్ చేయాల్సి వుంది. ఒక మేజర్ కార్పొరేట్ కంపెనీకి సీఈఓ, సీఎఫ్ఓ.. ఇద్దరూ ఆడవాళ్లే ఉండడం అనేది కూడా అత్యంత అరుదైన విషయం.

చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవరకు ఇప్పుడు 39 ఏళ్ళు. మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ మాస్టర్ డిగ్రీ చేసి.. అమెరికాకి వెళ్లి 22 ఏళ్ల వయసులోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. యూబీఎస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లాంటి కంపెనీల్లో చార్టర్డ్ ఫైనాన్సియల్ ఎనలిస్ట్‌గా చేసి.. ఆ తర్వాత డెట్రాయిట్ వెళ్లి జనరల్ మోటార్స్ లో చేరింది. అనేక పోర్ట్‌పోలియోలు తీసుకుని.. పనితీరులో పరిణితి సాధిస్తూ ఎదిగింది. 2017 జులై నుంచి జనరల్ మోటార్స్‌లో ఆమె కార్పొరేట్ ఫైనాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉండేది. ఇప్పుడు సీఎఫ్ఓ కుర్చీని చేపట్టి.. గ్లోబల్ సెలబ్రిటీగా మారింది.

Related News