పరకాలకు వారసుడొచ్చాడు!

పరకాల ప్రభాకర్ ‘తప్పుకోవడం’తో ఏపీ సర్కార్ మీడియా సలహాదారు కుర్చీ ఇప్పుడు ఖాళీగా వుంది. నిజానికి ఖాళీగా ఉండకూడని అతికొద్ది ప్రభుత్వ పోస్టుల్లో ఇదీ ఒకటి. ఒకవైపు పరకాల రాజీనామా ఆమోదంపై మల్లగుల్లాలు పడుతూనే.. మరోవైపు ఆయనకు రీప్లేస్‌మెంట్ ఎవరన్న కసరత్తు కూడా షురూ అయింది. ప్రస్తుతానికి.. పరకాల స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు అంటూ.. టీడీపీ సీనియర్ నేత చందు సాంబశివరావు పేరు స్పష్టంగా వినిపిస్తోంది. అమరావతి సచివాలయ వర్గాల నుంచి వచ్చిన ఈ వాసన నిజమే అయితే.. రేపోమాపో.. సంబంధిత ప్రకటన వెలువడ్డం ఖాయం.

గుంటూరు జిల్లా, కాకర్లమూడి గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన చందు సాంబశివరావు కర్ణాటక RECలో ఇంజనీరింగ్ చేసి.. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలో రెండు మాస్టర్స్ డిగ్రీలు తీసుకుని.. నాసాలో ఇంజనీరుగా వున్నారు. వీకెండ్స్‌ఃలో వర్జీనియా రాష్ట్రంలోని కమ్యూనిటీ కాలేజీల్లో ప్రొఫెసర్‌గా కూడా సర్వీస్ చేసేవారు. ఈ విధంగా అనేక రంగాల్లో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ మళ్ళీ స్వదేశానికి తిరిగొచ్చి.. పొలిటికల్ జర్నీ మొదలుపెట్టారు. ప్రస్తుతం గుంటూరు సిటీ టీడీపీ ప్రెసిడెంట్‌గా వున్న చందూ సాంబశివరావు.. మీడియా డిబేట్స్ ద్వారా.. తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని జనం ముందు పెట్టడంలో నిమగ్నమయ్యారు. విషయ పరిజ్ఞానం వున్న అతికొద్దిమంది తెలుగు పొలిటీషియన్లలో చందూ ఒకరు. పైగా సాధుస్వభావుడిగా.. మృదుమాటకారిగా మీడియాలో సైతం ఆయన మీద సాఫ్ట్‌కార్నర్ వుంది. ఈ ‘అర్హత’ల నేపథ్యంలోనే చంద్రబాబు ఆయన్ను ప్రమోట్ చేస్తారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

Related News