కేసీ‌ఆర్‌కు ‘ముందస్తు పరీక్ష’!

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ప్రకటించింది. అసెంబ్లీని ముందుగానే రద్దు చేసిన నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కమిషన్ నిలిపివేసింది. సవరణకు సంబంధించి కొత్త షెడ్యూలును ప్రకటించినట్టు తెలంగాణా చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ తెలిపారు.

ఓ సమగ్ర ముసాయిదా జాబితాను ఈ నెల10 న ప్రచురించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ తేదీ నుంచి క్లెయిములు, అభ్యంతరాలను ఈ నెల 25 వరకు దాఖలు చేయవచ్చునని, వీటి పరిశీలన అక్టోబర్ 4 న చేపడతామని అన్నారు. డేటా బేస్ ప్రింటింగ్ వచ్చే నెల 7 లోగా పూర్తవుతుందని స్పష్టం చేశారు. అంటే ఆ మరుసటి రోజున సవరించిన ఓటర్ల జాబితా ప్రచురితమవుతుంది. ఆ తేదీ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయి అని రజత్ కుమార్ పేర్కొన్నారు.. ఒక విధంగా 2018 ఓటర్ల జాబితా ప్రకారం ఈసీ ముందుకు పోవచ్చునని అంటున్నారు. మరోవైపు-ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా అన్న విషయాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ బృందాన్ని ఈనెల 11 న హైదరాబాద్‌కు పంపనుంది. సీనియర్ డిప్యూటీ ఎలెక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా ఆధ్వర్యాన ఈ బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుంది. తమ విజిట్ అనంతరం ఈ బృందం సభ్యులు ఈసీకి నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.

Related News