నిన్న జైట్లీ, నేడు సీబీఐ.. మాల్యా పారిపోవడం వెనుక

బ్యాంక్‌లకు కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యా గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. నిన్న అరుణ్ జైట్లీ సహాయం చేశాడని న్యూస్ రాగా, ఈసారి సీబీఐ వంతైంది. దర్యాప్తు సంస్థ సహాయంతో ఆయన విదేశాలకు పారిపోయాడన్నది న్యూవెర్షన్. ఈ విషయాన్ని సీబీఐ కూడా అంగీకరించడంతో ఈ వ్యవహారం హాట్ హాట్‌గా మారింది.

 

మార్చిలో మూడున ఏం జరిగింది?

 

మార్చి 3, 2016.. విజయ్‌మాల్యా మూటాముళ్లు సర్దుకుని ముంబై నుంచి లండన్‌కి పారిపోయిన రోజు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై  అప్పటికి 22 నెలలు. మాల్యా పారిపోతున్నాడన్న విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు ముంబైలో అత్యవసరంగా సమావేశమయ్యారు. దీనికి మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు సీబీఐ డైరెక్టర్‌ అనిల్‌సిన్హా హాజరయ్యారు. జులై 2015న మాల్యాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఆయన్ని ఎలా పారిపోనిచ్చారంటూ బ్యాంకర్లంతా సిన్హాపై విరుచుకుపడ్డారు. చివరకు బ్యాంక్ అధికారులు ఎటాక్ మొదలుపెట్టేసరికి.. ఆధారాల్లేవు కాబట్టి అరెస్టు చేయలేదంటూ సమాధానమిచ్చి సమావేశం నుంచి వెళ్లిపోయారు సీబీఐ డైరెక్టర్.

 

సీబీఐ అధికారులు ఏం చేశారు?

 

దేశం విడిచి పారిపోకుండా మాల్యాపై అక్టోబరు 16, 2015న లుకౌట్‌ నోటీసు జారీ చేసింది సీబీఐ. ఈ లెక్కన సీబీఐ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్తే, ఎయిర్‌పోర్టులోనే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేయాలి. అక్టోబర్2లో అధికారులు జారీ చేసిన నోటీసును నవంబర్ 24, 2015కి మార్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎ.కె.శర్మ అనుమతించారన్నది కొత్త వెర్షన్. ఇది మార్చకపోకుండా ఉంటే మాల్యాను కచ్చితంగా అరెస్టు చేసేశారు. నోటీసు మార్పు చేసే అధికారం శర్మకు వుందా? ముమ్మాటికీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. రూ.60 కోట్ల వరకు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ఆయనకు అధికారం వుంటుందని దిగువస్థాయి ఆఫీసర్స్ చెబుతున్నారు. అంతకుమించితే సీబీఐ డైరెక్టర్‌ అనుమతి తీసుకోవల్సిందే! నోటీసులో జరిగిన మార్పు గురించి సీబీఐ డైరెక్టర్‌కు శర్మ చెప్పలేదని, అందుకే బ్యాంకర్లు నిలదీసేసరికి సిన్హా తెల్లమొహం వేశారని ‘ఎన్డీటీవీ’ చేసిన  పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి.

సీబీఐ ఏమంటోంది?

 

లుకౌట్‌ నోటీసులో తీవ్రత తగ్గించడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, పొరపాటు నిర్ణయమేనని వెల్లడించింది సీబీఐ. మాల్యాను 2015 డిసెంబరు 9, 10, 11 తేదీల్లో ప్రశ్నించామని, అందుకే ఆయన విదేశీ ప్రయాణాలను అడ్డుకోవాల్సిన అవసరం తమకు అనిపించలేదని చెబుతోంది. మాల్యా దేశం నుంచి పారిపోతారనే అనుమానం ఏ కోశానా కలుగలేదని, తొలి నోటీసు ఇచ్చేనాటికి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారని గుర్తుచేసింది. 2015 డిసెంబరు చివరివారంలో ఒకసారి, 2016 జనవరిలో మరోసారి విదేశాలకు వెళ్లి వచ్చారు. ఫైనల్‌గా మార్చి 3న శాశ్వతంగా లండన్‌కు చెక్కేశారు.

 

మాల్యా వ్యవహారంపై రాహుల్..

 

విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడం వెనుక ప్రధాని హస్తం ఉందని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.మాల్యా పారిపోవడానికి సీబీఐ సాయం చేసింది.. అందుకు తగినట్లుగా లుక్‌అవుట్‌ నోటీసుల్లో మార్పులు చేసింది.. ఈ విషయంపై సీబీఐ నేరుగా ప్రధానికి నివేదించింది.. ఒక హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో పీఎం అనుమతి లేకుండా లుక్‌అవుట్‌ నోటీసుల్లో సీబీఐ మార్పులు చేయగలదా? అని ట్వీట్‌‌లో ప్రశ్నించారు.

 

Related News