రాహుల్‌పై విమర్శలు.. బీఎస్పీ నేత పదవులన్నీ ఫట్..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించి పదవిని పోగొట్టుకున్నాడు బహుజన సమాజ్ పార్టీ వైస్ చైర్ పర్సన్, జాతీయ సమన్వయకర్త జైప్రకాశ్ సింగ్. విదేశీయురాలికి  కొడుకైన రాహుల్ గాంధీ భారత ప్రధాని పదవికి పనికిరాడని జైప్రకాశ్ సింగ్ సంచలన కామెంట్లు చేసిన 24గంటలు తిరక్కముందే బీఎస్పీ అధినేత్రి మాయావతి కోలుకోలేని షాక్ ఇచ్చారు. జైప్రకాష్ సింగ్ ను పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తొలగించారు.

అంతేకాదు, ఇంకెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం విశేషం. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాయావతి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా సింగ్ మాట్లాడారని… అందుకే ఆయనను పదవుల నుంచి తొలగించామని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించేంతవరకు దీనిపై ఎవరూ వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. బహిరంగసభల్లో మాట్లాడేటప్పుడు… పేపర్‌పై రాసుకున్న ప్రసంగాలను చదవడమే మంచిదనికూడా మాయ పార్టీ నేతలకు సూచించారు.

Related News