కోర్టులో లొంగిపోయాడు

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వద్ద గన్‌తో వీరంగం సృష్టించిన బీఎస్పీ నేత రాకేశ్ పాండే కొడుకు ఆశిష్ పాండే గురువారం పాటియాలా హౌస్ కోర్టులో లొంగిపోయాడు. ఈ నెల 16‌న ఈ హోటల్ ఎంట్రన్స్‌లో ఇతగాడు ఓ జంటపై తన తుపాకీతో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఒక యువతికి తుపాకీ చూపుతూ ఆమెను బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటినుంచి ఆశిష్ జాడ లేదు. దీంతో ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేయడమే గాక, నాన్-బెయిలబుల్ వారంట్ తో బాటు లుకవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక గురుడు బయటపడక తప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ.. నేరుగా వెళ్లి  కోర్టులో సరెండర్ అయ్యాడు. ఆ రోజు జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, తనను టెర్రరిస్టులా పోలీసులు భావించి లుకవుట్ నోటీసులు జారీ చేయడమేమిటని ప్రశ్నించాడు. ఆ రోజు ఘటన జరిగిన తీరు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుందని, ఎవరో లేడీస్ టాయిలెట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని ఆశిష్ చెప్పాడు. తన భద్రత కోసమే గన్ తెచ్చుకున్నానని, ఎవరినీ తాను బెదిరించలేదన్నాడు. ‘ ఆ యువతి ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె నాతో అనుచితంగా ప్రవర్తించింది. నాపై పోలీసు కేసులేవీ లేవు. అందుకే కోర్టులో లొంగిపోయా ‘ అని అతగాడు పేర్కొన్నాడు.

Related News