రాహుల్ గాంధీకి సలాం కొట్టిన బీజేపీ ఎంపీ!

లోక్‌సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం కాస్తా.. ‘రాహుల్ వర్సెస్ మోదీ’గా మారిపోయింది. వీళ్లిద్దరి మాటలు-చేతల మీదే దేశవ్యాప్తంగా నాన్‌స్టాప్‌గా టాక్‌షో నడుస్తోంది. తాజాగా ఒక బీజేపీ ఎంపీ ముందుకొచ్చి.. రాహుల్‌కి ఏకంగా సలాం కొట్టేశాడు. వాజ్‌పేయి సర్కారులో మంత్రిగా చేసి, ప్రస్తుతం బీహార్లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా వున్న శత్రఘ్ను సిన్హా.. తాజాగా రాహుల్‌పై ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపించారు. తనకు నచ్చిన కొందరు పార్లమెంటేరియన్ల పేర్లను ప్రస్తావిస్తూ.. వీళ్లందరి కంటే ఇప్పడు రాహుల్ మీదే తనకు గురి కుదిరిందని చెప్పుకున్నాడు.

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ క్లుప్తంగా, పకడ్బందీగా మాట్లాడతారని, ఎన్సీపీ ఎంపీ తారిఖ్ అన్వర్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా లాంటి మరికొందరు పెద్దలు అరుదుగానైనా ఖచ్చితంగా మాట్లాడతారని.. ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్లందరినీ క్రాస్ చేసి తన మనసు గెల్చుకున్నారని సిన్హా అంటున్నారు.

ప్రధాని మోదీ విషయానికొస్తే ‘సోది చెప్పినట్లు గంటన్నరసేపు మాట్లాడితే ఎవరు వింటారు.. కాస్త నిడివి తగ్గించుకుంటే మేలు’ అంటూ చురక వేశారు. కొద్దికాలంగా మోదీ విధానాలతో విభేదిస్తూ బీజేపీ రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న శత్రఘ్ను సిన్హా.. త్వరలో తన పార్టీకి గడ్డు రోజులు తప్పవంటూ జోస్యం కూడా చెబుతారు.

Related News