ప్రధానిగా నేను పనికిరానా?

ఒకవైపు మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నప్పటికీ.. ప్రధాని అభ్యర్థి ఎవరన్న స్పష్టత ఎవ్వరికీ రావడం లేదు. తాజాగా వెల్లడైన ఇండియా టుడే సర్వేలో మోదీకి దీటుగా రాహుల్ గాంధీ మంచి మార్కులే సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రధాని కావాలన్న ఆయన ఆశలు నెరవేరే సూచనలు సన్నగిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోయిందన్న భావన ఇప్పటికీ బలంగానే వుంది. అటు.. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు కాబోయే కొత్త కూటమిలోనే ప్రధాని అభ్యర్థిపై ఏకాభిప్రాయం కలగలేదు. మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే కనుక.. ఉన్నవాటిలో ఏకైక బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ కే అవకాశం ఇద్దామన్న ప్రతిపాదనని ఎవ్వరూ ముందుకు జరపని పరిస్థితి. సోనియా గాంధీ కూడా రాహుల్ అభ్యర్థిత్వంపై ఓపెన్ గా ఎటూ చెప్పలేని పరిస్థితి. ప్రతిపక్ష కూటమిలో అనైక్యత ఏర్పడితే చూద్దామని కాచుకున్న బీజేపీకి ఛాన్సివ్వకూడదన్నది సోనియా అభిమతం. దీన్ని అలుసుగా తీసుకుని, శరద్ పవార్ లాంటి కొందరు నేతలు.. ప్రధాని పదవిపై ఇప్పుడే తేల్చబోమంటూ ప్రకటించేశారు.

ఈ క్రమంలో.. ‘ఫ్రంట్’ అల్లికలో కీలక పాత్ర పోషిస్తున్న బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మరో క్రూషియల్ స్టేట్మెంట్ వదిలారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన తరువాతే మహా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం ప్రకటిస్తామన్నది దీదీ చెప్పిన ముచ్చట. ప్రతిపక్ష పార్టీలకు చుక్కానిలా వ్యవహరించి ముందుకు నడిపే నాధుడే లేడన్న బీజేపీ నేతల వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. ఈ సమయంలో రాహుల్ గాంధీని ఎలివేట్ చేయడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రేసులో మీరున్నారా అన్న ప్రశ్నకు ‘వెయిట్ అండ్ సీ’ అంటూ సీరియస్ గా ముఖం పెట్టారామె. ఒక తాజా ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ వెల్లడించిన ఈ వైఖరి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Related News