క్వారీ వివాదమే కారణమా ?

అరకు ఎమ్మెల్యే కిడారి హత్యకు ఓ క్వారీ వివాదమే కారణమని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే. కిడారు సర్వేశ్వరరావు ఆదివారం ఉదయం 11 గంటలవరకు అరకులోనే ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి దుమ్రిగూడ మండలం లివితిపుట్టు  గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్ళారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా.. దాదాపు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఏజెన్సీలో ఇటీవల చోటుచేసుకున్న  పలు అంశాలపై వారు ఆయనతో  సుమారు గంట సేపు  చర్చించారు. కిడారికి చెందిన గూడ క్వారీపై మావోలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నందున మూసివేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఇందుకు అంగీకరించని ఎమ్మెల్యే..ఏదైనా ఉంటే చర్చలద్వారా పరిష్కరించుకోవాలని,  బెదిరింపులకు దిగడం సరికాదని వాదించినట్టు చెబుతున్నారు. దీంతో కోపగించిన మావోలు కిడారి, సోమలపై తుపాకులు ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మరో కథనం ప్రకారం..కిడారి. సోమ తమ కార్యకర్తలతో కలిసి బస్సులో వెళ్తుండగా.. లివితిపుట్టు  వద్ద వారి బస్సును దాదాపు 200 మంది మావోలు అడ్డగించారని, కిడారి, సోమలను మినహాయించి మిగిలినవారిని వెళ్లిపోవలసిందిగా కోరారని తెలిసింది. భయపడిన కార్యకర్తలంతా వెళ్ళిపోగా..ఈ ప్రజా ప్రతినిధులిద్దరిని మాత్రమే మావోలు కూర్చోబెట్టి అరగంట సేపు మాట్లాడిన తరువాత.. కాల్పులకు దిగారనికూడా వార్తలు వచ్చాయి. బాక్సైటు తవ్వకాలకు అనుకూలంగా పని చేయవద్దంటూ మావోలు వీరికి పలుమార్లు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ప్రజా ప్రతినిధులు భద్రత లేకుండా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లరాదని నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ ఖాతరు చేయకుండా వెళ్ళిన ఫలితమే ఇదని పోలీసువర్గాలు భావిస్తున్నాయి.

Related News